YS Vivekananda Reddy: సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభం
- వివేకా పీఏ ఇనయతుల్లాను ప్రశ్నించిన సీబీఐ
- వివేకా మృతదేహం ఫొటోలను తొలుత తీసింది ఈయనే
- ఆ సమయంలో అక్కడ ఎవరెవరున్నారని ఆరా తీస్తున్న సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభించింది. వివేకా వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా పీఏగా, ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఇనయతుల్లా పని చేసేవారు. 2019లో వివేకా హత్య జరిగినప్పుడు ఇంట్లోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు, వీడియోలను తొలుత తీసింది ఈయనే కావడం గమనార్హం. ఈయన మొబైల్ ద్వారానే ఫొటోలు ఇతరులకు షేర్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఫొటోలు తీసినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఫొటోలను ఎవరెవరికి పంపారు? అనే విషయాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇనయతుల్లాను సీబీఐ అనేక సార్లు విచారించింది. ఇప్పుడు మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు ఈ కేసులో సాక్షులు, సీబీఐ అధికారులకు వస్తున్న బెదిరింపులపై అక్టోబర్ 14 లోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీకోర్టు నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.