Atchannaidu: మేం కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావు: అచ్చెన్నాయుడు
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు
- బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం
- టీడీపీ సభ్యుల సస్పెన్షన్
- తుళ్లూరు పీఎస్ ఎదుట బిల్లు ప్రతులను దగ్ధం చేసిన టీడీపీ నేతలు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.
వారు శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.
నిరసన సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుని ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్ కు అర్థంకావడంలేదని తెలిపారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్ పేరు తొలగించలేదని వెల్లడించారు. సీఎం జగన్ లెంపలేసుకుని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు టీడీపీ పోరాడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.