CPI Ramakrishna: జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక యూనివర్సిటీని కూడా స్థాపించింది లేదు: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna question AP govt decision on name change to NTR Health University
  • ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు
  • పేరు మార్చడం తప్పు అన్న రామకృష్ణ
  • తుగ్లక్ చర్యేనని విమర్శలు
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. పదేపదే పలు అంశాలను వివాదాస్పదం చేయడం జగన్ కు అలవాటుగా మారిందని అన్నారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తప్పు అని రామకృష్ణ స్పష్టం చేశారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం తుగ్లక్ చర్యేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ కక్షపూరిత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 

జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక యూనివర్సిటీని కూడా స్థాపించింది లేదని రామకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది భర్తీ, సౌకర్యాల మెరుగుదలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. 

అటు, ఇదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ప్రజా పోరు కార్యక్రమంలో ఉన్న సోము వీర్రాజు ఈ ఉదయం అసెంబ్లీలో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాలను తెలుసుకుని ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చుతూ సభలో అమెండ్ మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక సింగిల్ లైన్ లో పేరు మార్పు ప్రతిపాదన తీసుకురావడం ప్రభుత్వ కుట్రపూరిత వైఖరికి నిదర్శనంలా కనిపిస్తోందని విమర్శించారు.
CPI Ramakrishna
NTR Health University
Name
YSRCP
TDP
Somu Veerraju
BJP
Andhra Pradesh

More Telugu News