Chiranjeevi: చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
- చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి
- పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించిన మెగాస్టార్
- 2027 వరకు డెలిగేటరీ ఐడీని విడుదల చేసిన కాంగ్రెస్
తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ, రాజకీయం తన నుంచి దూరం కాలేదని మెగాస్టార్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని జారీ చేసింది. త్వరలోనే జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఐడీ కార్డును విడుదల చేసినట్టు తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చిరంజీవికి పార్టీ ఐడీ కార్డును విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.