Suryakumar Yadav: ఐసీసీ ర్యాంకుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కిందికి నెట్టిన సూర్యకుమార్ యాదవ్
- టీ20 ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
- బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో స్థానానికి ఎగబాకిన సూర్య
- నాలుగో స్థానానికి పడిపోయిన బాబర్
- అగ్రస్థానం నిలుపుకున్న మహ్మద్ రిజ్వాన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టీ20 ర్యాంకులు విడుదల చేసింది. టీమిండియా 'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కిందికి నెట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ తాజా ర్యాంకుల్లో మెరుగవడానికి తోడ్పడింది. బాబర్ అజామ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు.
ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల టాప్-10లో సూర్యకుమార్ తప్ప మరో టీమిండియా ఆటగాడు స్థానం దక్కించుకోలేకపోయాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ 14, విరాట్ కోహ్లీ 16, కేఎల్ రాహుల్ 18వ స్థానాల్లో ఉన్నారు.
ఇక టీ20 బౌలర్ల ర్యాంకుల్లో భువనేశ్వర్ కుమార్ రెండు స్థానాలు పతనమై 9వ స్థానంలో నిలిచాడు. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు.
.