NTR University Of Health Sciences: పేరు మార్చి సాధించేదేమిటి?: పవన్ కల్యాణ్
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైసీపీ సర్కారు
- పేరు మార్పుపై సహేతుక కారణం చెప్పాలన్న పవన్ కల్యాణ్
- వివాదాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపణ
- ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు మన పాలకులకు తెలుసా అన్న పవన్
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ వైసీపీ సర్కారు ఏపీ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆ బిల్లు ఆమోదం పొందిన తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంస్థలకు పెట్టిన పేర్లను మార్చి ఏం సాధిస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయా సంస్థల పేర్ల మార్పిడితో వివాదాలను సృష్టించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడికి గల సహేతుక కారణాన్ని వైసీపీ సర్కారు వెల్లడించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు వస్తే.,.. వర్సిటీలో వసతులు మెరుగు అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆశించిన మేర వసతులు లేవని అన్నారు. కరోనా సమయంలో కేవలం మాస్కులు అడిగినందుకే డాక్టర్ సుధాకర్‌ను వేధింపులకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యారని పవన్ ఆరోపించారు. మెరుగు పరచాల్సిన మౌలిక వసతులను పక్కనపెట్టి... ఆయా సంస్థల పేర్లను మార్చుకుంటూ వెళుతున్న వైసీపీ సర్కారు... ప్రజల దృష్టిని సమస్యలపై నుంచి మళ్లించేందుకే యత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా పవన్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒరకైన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు మన పాలకుల్లో ఎవరికైనా తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేర్లు పెట్టాలన్న సంకల్పం ఉండి ఉంటే... ఎల్లాప్రగడ పేరు పెట్టి ఉండేవారన్నారు. బోదకాలు, టైఫాయిడ్ వంటి రోగాలకు మందులు కనిపెట్టి ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్తగా ఎల్లాప్రగడను పవన్ కీర్తించారు.