YSRCP: రెండూ ఒకే రోజు.. దేవుడి స్క్రిప్ట్.. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో..?: నారా లోకేశ్ ట్వీట్
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిన జగన్ సర్కారు
- పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదంటూ ఈసీ ప్రకటన
- రెండింటినీ మిక్స్ చేసి జగన్‌పై సెటైర్ వదిలిన లోకేశ్
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ బుధవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ఓ సెటైరికల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనను విడుదల చేసింది.
వరుసగా జరిగిన ఈ రెండు కీలక పరిణామాలను ప్రస్తావిస్తూ జగన్‌పై నారా లోకేశ్ సెటైర్ సంధించారు. 'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు' అంటూ లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండూ ఒకే రోజు జరిగాయని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జగన్ భవిష్యత్తు ఏమిటోనని కూడా లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. తన ట్వీట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి రాసిన లేఖ ప్రతిని కూడా ఆయన జత చేశారు.