India: పాన్ ఇండియా లెవెల్లో టాప్ హీరోల జాబితాలో సౌత్ స్టార్ల హవా.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీల స్థానం ఎంతంటే..!

List of most popular male stars in India released by Ormax
  • మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్ల జాబితాను విడుదల చేసిన ఓర్ మ్యాక్స్
  • అత్యంత పాప్యులర్ హీరోగా తమిళ నటుడు విజయ్
  • రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ 
  • బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు ఆరో స్థానం
ప్రస్తుతం భారతీయ సినిమా రంగం సరిహద్దులు చెరిగిపోయాయి. మొన్నటి వరకు ఏ భాషా చిత్రం ఆ భాషలోనే విడుదలయ్యేది. సౌత్ సినిమాలు దక్షిణాదిలోనే ఆడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. కరోనా పుణ్యమా అని ప్రేక్షకులు భాషలకు అతీతంగా కంటెంట్ ఉన్న ఏ సినిమానైనా ఆదరించే పరిస్థితి వచ్చింది. జనాలకు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో... అన్ని భాషా చిత్రాలను వీక్షించడానికి అలవాటు పడ్డారు. 

ఈ క్రమంలో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఉత్తరాదిన కూడా ఊపేస్తున్నాయి. బాలీవుడ్ సైతం విస్తుపోయేలా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది స్టార్లకు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. 

మరోవైపు, ప్రముఖ రేటింగ్స్ సంస్థ 'ఓర్ మ్యాక్స్' దేశంలో మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్ సర్వేను నిర్వహించింది. ఈ జాబితాలో టాప్ టెన్ లో జాబితా మొత్తాన్ని దక్షిణాది స్టార్లే ఆక్రమించారు. బాలీవుడ్ కు కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కింది. 

టాప్ వన్ స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలిచారు. రెండో స్థానంలో ప్రభాస్, మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఐదో స్థానాన్ని కన్నడ స్టార్ యశ్ ఆక్రమించారు. బాలీవుడ్ కు ఆరో స్థానం దక్కడం గమనార్హం. ఆరో స్థానంలో బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రామ్ చరణ్, మహేశ్ బాబు, సూర్య, అజిత్ ఉన్నారు. ఆగస్ట్ 2022 వరకు పాన్ ఇండియా లెవెల్లో తీసుకున్న గణాంకాల ఆధారంగా ఓర్ మ్యాక్స్ ఈ జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాను పరిశీలించినట్టయితే... ఖాన్ ల స్టార్ డమ్ పూర్తిగా తగ్గినట్టే కనిపిస్తోంది.
India
Most Popular Male Stars
Pan India
Tollywood
Bollywood
Kollywood

More Telugu News