Hyderabad: టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద తొక్కిసలాట..పలువురికి గాయాలు
- నేటి నుంచి కౌంటర్లలో టికెట్లు అమ్ముతామని ప్రకటించిన హెచ్ సీఏ
- ఉదయం నుంచి కిలోమీటర్ల మేర బారులు తీసిన యువకులు
- జింఖానా మైదానం వద్ద తోపులాట.. లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు
భారత్- ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్ల వ్యవహారం అభిమానుల ప్రాణాలకు మీదకు తెస్తోంది. జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఇందులో పదుల సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. గాయపడ్డ ఓ మహిళ మృతి చెందినట్టు వార్తలు వచ్చినా.. పోలీసులు ఖండించారు.
గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానా మైదానంలో కౌంటర్లలో టికెట్లు విక్రమయిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం నిన్న రాత్రి ప్రకటించింది. దాంతో, ఉదయం తెల్లవారుజాము మూడు గంటల నుంచే వేల సంఖ్యలో అభిమానులు క్యూ కట్టారు. జింఖానా గేటు నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకూ బారులు తీరారు. వేలాది మంది ఒక్క చోటుకు చేరడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. కానీ, 11.30 దాటినా కూడా కౌంటర్లు ప్రారంభించకపోవడంతో యువకులు అసహనం వ్యక్తం చేశారు.
అదే సమయంలో కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే ఇస్తామని సమాచారం రావడంతో అభిమానులు ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు చేరుకునేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్లోకి దూకేందుకు కొందరు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ఈ క్రమంలో, తొక్కిసలాట జరగడంతో దాదాపు 20 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో పలువురు మహిళలు, పోలీసులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రౌండ్ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది. టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. అయితే, ఇంత జరుగుతున్నా హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.