CPI Narayana: ఎన్టీఆర్ పేరును తొలగించాలనే నిర్ణయాన్ని జగన్ వెంటనే వెనక్కి తీసుకోవాలి: సీపీఐ నారాయణ
- తండ్రి పేరు పెట్టుకోవాలంటే రాష్ట్రంలో ఎన్నో యూనివర్శిటీలు, కాలేజీలు ఉన్నాయన్న నారాయణ
- ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్న
- పేరు మార్చడం ద్వారా ఒక దారుణమైన సంస్కృతికి తెరలేపారని విమర్శ
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని సీపీఐ నేత నారాయణ తప్పుపట్టారు. తన తండ్రి పేరు పెట్టుకోవాలని జగన్ అనుకుంటే రాష్ట్రంలో ఎన్నో యూనివర్శిటీలు, కాలేజీలు ఉన్నాయని... కావాలంటే వాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చని అన్నారు. అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. యూనివర్శిటీ పేరును మార్చడం ద్వారా జగన్ ఒక దారుణమైన సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లను మార్చుకుంటూ పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే తొలి హెల్త్ యూనివర్శిటీని విజయవాడలో స్థాపించారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం దుర్మార్గమని అన్నారు. జగన్ చర్య చాలా ఫన్నీగా ఉందని విమర్శించారు. తన నిర్ణయాన్ని జగన్ వెంటనే వెనక్కు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.