Oleg Ustenko: రష్యాతో యుద్ధ ఫలితం.. ఇప్పటి వరకు రూ. 80 లక్షల కోట్లు నష్టపోయిన ఉక్రెయిన్
- రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ అతలాకుతలం
- భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
- ప్రభుత్వ వ్యయంలో భారీగా కోతలు
- ప్రతి నెల 5 బిలియన్ యూరోల చొప్పున లోటు
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా ఆ దేశాన్ని క్రమంగా ఆక్రమించుకుంటూ ముందుకు సాగుతోంది. రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతూ నగరాలను ధ్వంసం చేస్తోంది. ఈ క్రమంలో లెక్కలేనంతమంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తినష్టం కూడా భారీగా సంభవిస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు రూ. 80 లక్షల కోట్ల (ట్రిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లినట్టు అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆర్థిక సలహాదారు ఓలెగ్ ఉస్తెంకో తెలిపారు.
జర్మనీ రాజధాని బెర్లిన్లో నిర్వహించిన ‘జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపుతోందని, తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్టు చెప్పారు.
వ్యాపారాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని తెలిపారు. దీంతో ప్రభుత్వ వ్యయంలో భారీగా కోతలు విధించామని, అయినప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు 5 బిలియన్ యూరోల (4.9 బిలియన్ డాలర్లు) చొప్పున లోటును ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది ఇది 3.5 బిలియన్ డాలర్లకు తగ్గే అవకాశం ఉందన్న ఉస్తెంకో.. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ 35 నుంచి 40 శాతం క్షీణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన 1991 తర్వాత ఇప్పుడు ఎదుర్కొంటున్నదే అత్యంత గడ్డుకాలమని ఆయన పేర్కొన్నారు.