Mohan Bhagawat: ముస్లిం ఇమామ్ లతో ఆరెస్సెస్ అధినేత భేటీ కావడంపై కాంగ్రెస్ సెటైర్లు

Walk With Rahul Gandhi says Congress To RSS Chief

  • ఢిల్లీలోని మసీదు, మదరసాను సందర్శించిన మోహన్ భగవత్
  • భారత్ జోడో యాత్ర కారణంగానే ముస్లింలను కలిశారన్న కాంగ్రెస్
  • యాత్ర ప్రారంభమైన 15 రోజుల్లోనే కాషాయ శ్రేణుల్లో వణుకు పుడుతోందని వ్యాఖ్య

ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పై ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఓ మసీదు, మదరసాను భగవత్ నిన్న సందర్శించారు. మదరసాలోని ముస్లిం విద్యార్థులతో ముచ్చటించారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అల్యాసీతో పాటు కొందరు ముస్లిం నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ కలయిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మోహన్ భగవత్ ను 'జాతిపిత' అంటూ ఇల్యాసీ కొనియాడారు. 

ఈ నేపథ్యంలో.. ముస్లిం నేతలతో మోహన్ భగవత్ సమావేశం కావడంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ స్పందిస్తూ... రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టడం వల్లే ముస్లింలతో భగవత్ భేటీ అయ్యారని ఆయన అన్నారు. రాహుల్ యాత్ర కాషాయ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తోందని... అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింలతో మోహన్ భగవత్ తొలిసారి భేటీ అయ్యారని చెప్పారు. భారత్ జోడో యాత్ర మీపై అంత ప్రభావాన్ని చూపి ఉంటే... జాతీయ జెండాను పట్టుకుని రాహుల్ తో పాటు ఒక గంట సేపు నడవాలని అన్నారు.

మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... భారత్ జోడో యాత్ర ప్రారంభమై కేవలం 15 రోజులు మాత్రమే అయిందని... కానీ, అప్పుడే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధులు 'గాడ్సే ముర్దాబాద్' అంటున్నారని... విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్ర మంత్రులు పునరాలోచనలో పడ్డారని... ముస్లిం ఇమామ్ లను భగవత్ కలిశారని... రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూద్దామని ఎద్దేవా చేశారు. మరోవైపు మదరసా డైరెక్టర్ మహ్ముదుల్ హసన్ మాట్లాడుతూ... మదరసా లోపల మోహన్ భగవత్ దాదాపు గంటసేపు గడిపారని... ఇక్కడున్న పిల్లలు, అధ్యాపకులతో ముచ్చటించారని చెప్పారు.

  • Loading...

More Telugu News