Andhra Pradesh: సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ అరెస్ట్ చేయడం అన్యాయం: చంద్రబాబు
- ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్ ను ఫార్వార్డ్ చేసిన జర్నలిస్టు కొల్లు అంకబాబు
- అంకబాబు అరెస్ట్ పై వేగంగా స్పందించిన టీడీపీ
- 73 ఏళ్ల జర్నలిస్ట్ అరెస్ట్ జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతోందన్న చంద్రబాబు
ఏపీ సీఐడీ అధికారులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ పోస్ట్ ను వాట్సాప్ లో ఫార్వార్డ్ చేశారన్న కారణంతో అంకబాబును అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. ఈ అరెస్ట్ పై విపక్ష టీడీపీ ఘాటుగా స్పందించింది. అంకబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటుగా ఆయన అరెస్ట్ అనైతికమంటూ విమర్శలు గుప్పించింది.
విజయవాడ లో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నానంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వాట్సాప్ లో ఒక వార్తను ఫార్వార్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుందని వ్యాఖ్యానించారు. తక్షణమే అంకబాబును విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.