health: బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం.. మంచి కొవ్వు ఎక్కువ ఉండే 9 ఆహార పదార్థాలు ఇవిగో

 Nine healthy foods that contains good fat

  • శాచురేటెడ్‌ ఫ్యాట్‌ శరీరానికి ప్రమాదకరం అంటున్న నిపుణులు
  • అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడి
  • మాంసాహారులకైతే గుడ్లు, చేపల్లో మంచి ఫ్యాట్‌ లభిస్తుందని వివరణ
  • శాకాహారులు డ్రైఫ్రూట్స్‌, బీన్స్‌, ఆలివ్స్‌, పెరుగు వంటివి తీసుకోవాలని సూచన

కొవ్వు అనగానే చాలా మందిలో అది ప్రమాదకరమన్న భావన ఉంది. ఆహారంలో ఉండే ప్రతి కొవ్వు పదార్థంతో ప్రమాదం ఉంటుందన్న ఆలోచన సరికాదని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొవ్వులలో శాచురేటెడ్‌ (సంతృప్త), అన్‌ శాచురేటెడ్‌ (అసంతృప్త) అని రెండు రకాలు ఉంటాయని.. వీటిలో అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు. పలురకాల జీవ క్రియలకు అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఎంతో తోడ్పడుతుందని.. అదే సమయంలో శరీరానికి మంచి శక్తిని కూడా అందిస్తుందని వివరిస్తున్నారు. తొమ్మిది ఆహార పదార్థాల నుంచి మంచి కొవ్వులు లభిస్తాయని సూచిస్తున్నారు.

1. గుడ్లు
దాదాపు అన్ని రకాల పోషకాలు లభించే గుడ్లలో కొవ్వు కూడా గణనీయంగానే ఉంటుంది. ఒక గుడ్డులో 5 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటే.. అందులో 1.6 గ్రాములు శాచురేటెడ్‌, మిగతా 3.4 గ్రాములు అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా గుడ్లలో ఆరు గ్రాముల ప్రొటీన్లు ఉంటాయని.. మన శరీరానికి అవసరమయ్యే తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు ఉంటాయని వివరిస్తున్నారు. దీనికితోడు విటమిన్‌ బీ12, పాస్ఫరస్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయని.. ఇవన్నీ ఆరోగ్యానికి తోడ్పడతాయని చెబుతున్నారు.

2. డ్రైఫ్రూట్స్‌
శరీరానికి మంచి పోషకాలు అందించే ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ ఎంతో కీలకమైనవి. ఒక ఔన్స్‌ (28 గ్రాములు) డ్రైఫ్రూట్స్‌లో 15 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా వీటిలో ఐరన్‌, విటమిన్‌ ఈ, కాపర్‌, మాంగనీస్‌, ఫాస్పరస్‌, ఫైబర్‌ వంటివి మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. డ్రైఫ్రూట్స్‌ ను రోజూ స్నాక్స్‌ లా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

3. గింజలు
వివిధ రకాల పండ్లు, కూరగాయల్లోని గింజలు కూడా మంచి కొవ్వులకు నిలయమని నిపుణులు చెబుతున్నారు. పొద్దు తిరుగుడు, ఫ్లాక్స్‌ సీడ్స్‌, గుమ్మడి గింజలు, సబ్జ గింజలు వంటి గింజల్లో ప్రతి ఔన్స్‌ (28 గ్రాములు)కు 12 గ్రాముల మేర అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటుందని వివరిస్తున్నారు. అంతేగాకుండా శరీరానికి అత్యవసరమైన ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్‌ వంటివీ లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

4. డార్క్‌ చాకోలేట్‌
తీపిగా ఉంటూనే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కోసం వెతికితే.. మీకు డార్క్‌ చాకోలేట్‌ మంచి చాయిస్‌ అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఔన్స్‌ డార్క్‌ చాకోలెట్‌ లో 8.9 గ్రాముల ఆరోగ్యకర ఫ్యాట్‌ ఉంటుందని వివరిస్తున్నారు. దానితోపాటు 2 మిల్లీగ్రాముల ఐరన్‌, 158 మిల్లీగ్రాముల పొటాషియం కూడా లభిస్తుందని.. మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌, కాపర్‌, ఫాస్పరాస్‌ వంటి పోషకాలూ లభిస్తాయని పేర్కొంటున్నారు.

5. ఫ్యాటీ చేపలు
కొవ్వు, నూనెల శాతం ఎక్కువగా ఉండే ట్యూనా, సాల్మన్‌, ఇతర చేపలు అత్యంత ఆవశ్యకమైన ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లకు నిలయమని నిపుణులు చెబుతున్నారు. మన మెదడు, గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ చేపల్లో ప్రతి 100 గ్రాములకు 4.5 గ్రాముల మంచి ఫ్యాట్‌ లభిస్తుందని.. ప్రోటీన్లు, విటమిన్లు, జింక్‌, అయోడిన్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి అత్యవసర ఖనిజాలూ శరీరానికి అందుతాయని అంటున్నారు. 

6. పెరుగు
శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోబయాటిక్‌ గా పెరుగుకు పేరుంది. అంతేకాకుండా పెరుగులో మంచి ఫ్యాట్‌ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి 100 గ్రాముల పెరుగులో 4.4 గ్రాముల మంచి ఫ్యాట్‌, 9 మిల్లీగ్రాముల ప్రొటీన్‌ లభిస్తాయని వివరిస్తున్నారు. పెరుగులో డ్రైఫ్రూట్స్‌, గింజలు, యాపిల్‌, అరటి, స్ట్రాబెర్రీల వంటివి చేర్చుకుని తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

7. బీన్స్‌
ఒక కప్పు బీన్స్‌ లో 0.9 గ్రాముల మంచి ఫ్యాట్‌ ఉంటుందని, దీనికితోడు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌ లోని ప్రోటీన్లతో శరీరంలో కండరాలు బలోపేతం అవుతాయని.. ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, కొలెస్ట్రాల్‌, మధుమేహం, గుండె జబ్బులను నియంత్రణలో ఉంచుతుందని వివరిస్తున్నారు.


8. అవకాడో
అవకాడో అద్భుతమైన పోషకాల గని అని.. ఆరోగ్యకరమైన మోనో అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ కు నిలయమని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. వీటిలో ప్రోటీన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు, సీ, ఈ, కె, బీ విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు. శరీరానికి పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని సమకూర్చేందుకు అవకాడోలు తోడ్పడతాయని వివరిస్తున్నారు.

9. ఆలివ్‌
శరీరానికి ఎంతో మేలు చేసే ఓలెయిక్‌ మోనో అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌ ఆలివ్‌లలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్‌ నూనెలో 11 శాతం నుంచి 15 శాతం మంచి ఫ్యాట్‌ ఉంటుందని, విటమిన్‌ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని వివరిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల మెదడు, చర్మం, గుండె ఆరోగ్యంగా ఉంటాయని.. రోగ నిరోధక శక్తి పనితీరు మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.

వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ మంచిదే అయినా.. అన్ని పరిస్థితుల్లోనూ, అందరికీ సరిపడకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్యాలు, ఊబకాయం వంటి వాటితో బాధపడే వారికి వీటివల్ల సమస్యలు కూడా రావొచ్చని అంటున్నారు. అందువల్ల వైద్యుల సలహా తీసుకుని.. ఆహారంలో మార్పులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News