Rohit Sharma: నాగ్‌పూర్‌లో రోహిత్ శర్మ వీరబాదుడుకు కారణం చెప్పిన సునీల్ గవాస్కర్

Sunil Gavaskar explains reason behind Rohit Sharmas terrific knock in Nagpur Match
  • గత కొంతకాలంగా పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్న రోహిత్
  • గత రాత్రి రెచ్చిపోయిన టీమిండియా స్కిప్పర్
  • అద్భుతంగా ఆడాడన్న గవాస్కర్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గత రాత్రి నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించి సిరీస్‌ను 1-1గా సమం చేసింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత జట్టు 91 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో సిరీస్ ఫలితం హైదరాబాద్ మ్యాచ్‌కు బదిలీ అయింది.

పరుగులు రాబట్టడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న స్కిప్పర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 20 బంతుల్లో  నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలతో విరుచుకుపడ్డాడు. క్రీజులో పాతుకుపోవాలని, ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బ్యాట్‌ను ఝళిపించడం మానుకోవాలని సూచించాడు. అలాగే, ఫీల్డింగ్ వైఫల్యాలు సరిదిద్దుకోవాలని సూచించాడు.

గత రాత్రి మ్యాచ్ అనంతరం అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ చాలా సెలక్టివ్‌ షాట్లు ఆడాడని ప్రశంసించాడు. ఫ్లిక్‌షాట్లు, పుల్‌షాట్లను అద్భుతంగా ఆడాడని అన్నాడు. రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఇదే కారణమని విశ్లేషించాడు. టీమిండియా టాపార్డర్ తరచూ విఫలమవుతుండడంతో బాధితుడిగా మారిన రోహిత్.. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒంటిస్తంభంలా నిలబడ్డాడు. టాపార్డర్ పెవిలియన్ చేరుతున్నా అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయి పరుగుల వర్షం కురిపించి జట్టుకు విజయాన్ని అందించాడు. 

రోహిత్ హిట్టింగ్‌లో ఎలాంటి సమస్యలు లేవని, తను ఏం చేయాలనుకున్నాడో నేటి మ్యాచ్‌లో సరిగ్గా అదే చేశాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. బంతి కోసం ఎదురుచూశాడని, బంతిని నేరుగా ఆడకుండా కట్ చేస్తూ, పుల్ చేస్తూ అద్భుతంగా ఆడాడని గవాస్కర్ ప్రశంసించాడు.
Rohit Sharma
Sunil Gavaskar
Team India
Nagpur Match

More Telugu News