NIA: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అజెండా ఇదే అంటున్న ఎన్ఐఏ
- పీఎఫ్ఐ సంస్థపై తీవ్ర ఆరోపణలు
- ఇటీవల దేశవ్యాప్తంగా దాడులు జరిపిన ఎన్ఐఏ
- 106 మంది అరెస్ట్
- వారిలో 10 మంది కస్టడీ కోరిన ఎన్ఐఏ.. కోర్టు అనుమతి
చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అజెండా ఇదేనంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక వివరాలు వెల్లడించింది. దేశంలో ఒక వర్గానికి చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పథక రచన చేసిందని వివరించింది.
ఎన్ఐఏ ఇటీవల దేశవ్యాప్తంగా దాడులు జరిపి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధికంగా కేరళకు చెందిన 22 మంది, కర్ణాటకకు చెందిన 20 మంది ఉన్నారు. సోదాల్లో అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వీరిలో 10 మందిని కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది. దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును ఎన్ఏఐ కోర్టు ముందుంచింది.
భారత్ లో జీహాద్ కు యత్నిస్తోందని, దేశంలో ఇస్లామిక్ పాలన తీసుకువచ్చేందుకు కుట్ర పన్నిందని పీఎఫ్ఐపై ఆరోపణలు చేసింది. ప్రభుత్వ విధానాలపై ముస్లింలలో దుష్ప్రచారం చేస్తూ, భారత్ లో అసహనాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తోందని ఎన్ఐఏ వెల్లడించింది.
ముఖ్యంగా, అల్ ఖైదా, ఐసిస్, లష్కరేతోయిబా వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ముస్లిం యువతను ప్రోత్సహిస్తోందని పేర్కొంది. కాగా, ఎన్ఐఏ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. 10 మంది పీఎఫ్ఐ సభ్యులను ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.