Narendra Modi: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. చండీగఢ్ ఎయిర్పోర్ట్కు భగత్ సింగ్ పేరు
- చీతాల రాకతో భారతీయులంతా గర్వంతో ఉప్పొంగిపోయారన్న మోదీ
- ఈరోజు మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి
- దీన్ దయాళ్ ను స్మరించుకున్న మోదీ
భారత్ లో అంతరించిపోయిన చీతాలను (చిరుతల్లో ఒక రకం) నమీబియా నుంచి మన దేశానికి తిరిగి తీసుకురావడం పట్ల 130 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోయి, గర్వపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ అమృత్ మహోత్సవం ప్రత్యేక రోజు అని ప్రధాన అన్నారు. ఆ రోజున మనం భగత్ సింగ్ జీ జయంతిని జరుపుకుంటామన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 93వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. ‘చీతాలు తిరిగి రావడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోయారు. ఒక టాస్క్ ఫోర్స్ ఈ చీతాలను పర్యవేక్షిస్తుంది. అది ఇచ్చే రిపోర్టు ఆధారంగా చీతాలను ప్రజలు ఎప్పుడు సందర్శించవచ్చో నిర్ణయిస్తాం’ అని ప్రధాని మోదీ అన్నారు.
చీతాల కోసం ప్రచారానికి మంచి పేరును సూచించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ప్రత్యేక విమానంలో నమీబియా నుంచి 8 చీతాలను కేంద్రం భారత్ తీసుకొచ్చింది. వీటిని మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఉంచారు. ఇక, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 106వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళులు అర్పించారు. భారతీయ తత్వశాస్త్రం.. ఆధునిక యుగంలోనూ సామాజిక, రాజకీయ కోణంలో కూడా ప్రపంచాన్ని ఎలా నడిపించగలదో దీన్ దయాళ్ మనకు నేర్చించారని ప్రధాని కొనియాడారు.