Maa Robot: దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం తినిపించే రోబోను తయారుచేసిన కూలీ.. వాయిస్ కమాండ్‌తో పనిచేస్తున్న రోబో!

Goa daily wage worker builds Maa Robot to feed his differently abled daughter
  • అద్భుతం చేసిన గోవాకు చెందిన కూలీ
  • నాలుగు నెలలు కష్టపడి వాయిస్ కమాండ్‌తో పనిచేసే రోబోకు రూపకల్పన
  • ‘మా రోబో’గా పేరు పెట్టిన బిపిన్ కదమ్
  • ప్రశంసలు కురిపించిన గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్
లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని సాధనకు అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో ఏర్పడే అవరోధాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కలకు కృషి తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మరోమారు నిరూపించాడు గోవాకు చెందిన దినసరి కూలి. పెద్దగా చదువుకున్నది ఏమీ లేదు. అయితే నేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన బిపిన్ కదమ్ (40)కు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. స్వయంగా భోజనం కూడా తినలేని కుమార్తెను చూసి బిపిన్ ఎంతగానో బాధపడేవాడు. ఆమె బాగోగులన్నీ భార్యే చూసుకునేది. అయితే, రెండేళ్ల క్రితం ఆమె కూడా మంచం పట్టింది. దీంతో కుమార్తెకు అన్నం తినిపించేవారు కరవయ్యారు. దినసరి కూలీ అయిన బిపిన్ ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవాడు. ఇలాగైతే లాభం లేదని కుమార్తెకు అన్నం తినిపించేందుకు రోబో ఏమైనా దొరుకుతుందేమోనని మార్కెట్లో వాకబు చేశాడు. అలాంటిదేమీ లేకపోవడంతో ఇక లాభం లేదని, తానే ఆ పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.

     నాలుగు నెలల్లోనే పరిశోధన తర్వాత..
పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకున్నాడు. దాని సాయంతో నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. పూర్తిగా వాయిస్ కమాండ్‌తో పనిచేసే దీనికి ‘మా రోబో’ (తల్లి రోబో) అని పేరు పెట్టాడు. 

దాని చేతిలో ఆహారం ఉన్న పళ్లెం పెడితే అది కలిపి కుమార్తెకు తినిపించేలా డిజైన్ చేశాడు. అంతేకాదు, వాయిస్ కమాండ్ ద్వారా ఆహారాన్ని ఏ కూరతో కలిపి తినిపించాలో చెబితే రోబో అదే చేస్తోంది. ఈ రోబో విజయవంతంగా పనిచేస్తుండడంతో బిపిన్‌ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. విషయం వెలుగులోకి రావడంతో గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బిపిన్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన తయారు చేసిన ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది.
Maa Robot
Goa
Bipin Kadam
Goa State Innovation Council

More Telugu News