Vikram: తెలుగు ప్రేక్షకులను 'పొన్నియిన్ సెల్వన్' థియేటర్లకు రప్పిస్తుందా?
- మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వెన్'
- చోళరాజులు.. పాండ్య రాజుల పోరాటమే ప్రధానమైన కథ
- తమిళనాట భారీ ప్రమోషన్స్
- తెలుగులో ఆ స్థాయిలో కనిపించని హడావిడి
- ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల
సౌత్ నుంచి మరో భారీ చిత్రం ప్రపంచపటాన్ని ఆక్రమించడానికి సిద్ధమవుతోంది ... ఆ సినిమా పేరే 'పొన్నియిన్ సెల్వన్'. తమిళంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రికార్డు స్థాయిలో అమ్ముడైన నవల ఇది. ఈ నవలను సినిమాగా చేయడానికి ఎంజీఆర్ ఎంతగానో ప్రయత్నించినా కుదరలేదు. మణిరత్నమే రెండుసార్లు విఫలమై .. మూడోసారి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగారు. ఆ కథలోని భారీతనం .. స్టార్స్ డేట్లు .. వాళ్ల పారితోషికాలు.. అన్నీ ఎక్కువే.
ఈ కథ 1000 సంవత్సరాల క్రితం నాటిది. 'రాజ రాజ చోళుడు' ఒకసారి కావేరీ నది కారణంగా బ్రతికి బయటపడ్డాడట. కావేరి నదిని 'పొన్ని' అంటారు .. సెల్వన్ అంటే తమిళంలో కుమారుడు అని అర్థం. అందువల్లనే ఆయనను అందరూ 'పొన్నియిన్ సెల్వన్' అని పిలిచేవారు. ఈ సినిమాలో ప్రధానమైనవిగా ఓ 15 పాత్రలు కనిపిస్తాయి. ప్రతి పాత్రకు ప్రత్యేకత .. విశిష్టత కనిపిస్తాయి. చోళరాజుల .. పాండ్య రాజుల మధ్య జరిగే వ్యూహాలే ఈ సినిమా.
ఈ సినిమాను ఇతర భాషలతో పాటు తెలుగులోనూ ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకుని వస్తున్నారు. ఇటీవల ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కూడా. కానీ రిలీజ్ డేట్ మరింత దగ్గర పడుతుండగా కనిపించవలసిన హడావిడి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం చేస్తున్న సందడి సరిపోదనిపిస్తోంది. ప్రధానమైన పాత్రధారులంతా తెలుగువారికి పరిచయమున్నవారే. పైగా మణిరత్నం సినిమాలను ఇష్టపడేవారు సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. మల్టీప్లెక్స్ లలో అన్నీ కలుపుకుని 330 రూపాయలు .. సింగిల్ స్క్రీన్ లలో 175 రూపాయలుగా టిక్కెట్ల రేట్లను నిర్ణయించారట. మరి ఆ రేటును దాటుకుని థియేటర్స్ కి ప్రేక్షకులు వచ్చేలా ఈ సినిమా చేయగలుగుతుందేమో చూడాలి.