AR Rahman: రీమిక్స్ పై స్పందించిన ఏఆర్ రెహమాన్
- రీమిక్స్ చేస్తే వక్రీకరించినట్టేనని వ్యాఖ్య
- ఒకరి కష్టాన్ని గౌరవించాలన్న రెహమాన్
- తానైతే ముందస్తు అనుమతి తీసుకుంటానని వెల్లడి
కొంత మంది సంగీతకారులు పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇలాంటివన్నీ వక్రీకరణలేనన్నారు. కంపోజర్ ఉద్దేశ్యం సైతం వక్రీకరణకు గురవుతుందన్నారు. ‘తాము తిరిగి సృష్టిస్తున్నామని కొందరు చెబుతుంటారు. తిరిగి సృష్టించడానికి మీరెవరు?’ అని రెహమాన్ ప్రశ్నించారు. ఒకరు చేసిన కష్టాన్ని తీసుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకరి కష్టాన్ని గౌరవించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలావుంచితే, ఏఆర్ రెహమాన్, మణిరత్నం కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ల క్రితం 'రోజా' సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. మరోసారి ఇద్దరూ కలసి ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకు పనిచేశారు.