Cinema Theaters: భారత్ లో తగ్గిన థియేటర్ల సంఖ్య... చైనాలో మన సినిమా జోరు
- భారత్ లో 8 వేలకు పడిపోయిన థియేటర్ల సంఖ్య
- చైనాలో 70 వేలకు పెరిగిన థియేటర్ల సంఖ్య
- చైనాలో అధిక బిజినెస్ చేస్తున్న భారతీయ చిత్రాలు
- ఎఫ్ఎఫ్ఓ ఏర్పాటు చేసిన కేంద్రం
- కొత్త థియేటర్ల నిర్మాణానికి సత్వర అనుమతులు
ముంబయిలో ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ లో సినిమా థియేటర్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని అన్నారు.
ఐదారు సంవత్సరాల క్రితం దేశంలో 12 వేల సినిమా థియేటర్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 8 వేలకు పడిపోయిందని తెలిపారు. అదే సమయంలో చైనాలో సినిమా హాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని, ఐదారేళ్ల కిందట చైనాలో 10 వేల థియేటర్లు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పెరిగిందని అన్నారు.
ఈ కారణంగానే భారతీయ చిత్రాలు దేశంలో కంటే చైనాలో అధికంగా ప్రదర్శితమవుతున్నాయని అపూర్వ చంద్ర వెల్లడించారు. మన సినిమాలకు ఇక్కడి కంటే చైనాలో అధిక బిజినెస్ లభిస్తోందని తెలిపారు.
ఈ పరిస్థితిని అధిగమించాలంటే, దేశంలో మరిన్ని థియేటర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం కొత్తగా ఫిలిం ఫెసిలిటేషన్ ఆఫీస్ (ఎఫ్ఎఫ్ఓ) ఏర్పాటైందని, సినిమా థియేటర్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులను ఈ కార్యాలయం వేగంగా మంజూరు చేస్తుందని అపూర్వ చంద్ర తెలిపారు.
ప్రజలకు సినిమా ప్రధాన వినోదం అని, టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని అభిప్రాయపడ్డారు.