Paidi Jairaj: తెలంగాణ కీర్తిని జాతీయస్థాయిలో చాటిన గొప్ప సినీ నటుడు పైడి జైరాజ్: సీఎం కేసీఆర్

Telangana CM KCR paid tributes to actor Paidi Jairaj

  • తెలంగాణ గడ్డపై పుట్టిన పైడి జైరాజ్
  • జన్మస్థానం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల 
  • నటనపై ఆసక్తితో 1929లో ముంబయి పయనం
  • నేడు పైడి జైరాజ్ 113వ జయంతి

తెలంగాణలో పుట్టి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు పైడి జైరాజ్. బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ అనదగ్గ షోలే, తూఫాన్, డాన్, ముఖద్దర్ కా సికందర్ వంటి చిత్రాల్లోనూ పైడి జైరాజ్ నటించారు. 100కి పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. ఆయనకు 1980లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 

కాగా, నేడు పైడి జైరాజ్ 113వ జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఘననివాళి అర్పించారు.. తెలంగాణ గడ్డపై పుట్టి, భారత చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయస్థాయిలో చాటిచెప్పిన గొప్పనటుడు, కరీనంగర్ బిడ్డ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ అని కీర్తించారు. 

జాతీయ చలనచిత్ర పరిశ్రమకు పైడి జైరాజ్ అందించిన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సినిమా తొలి దశలో ప్రారంభమైన మూకీల నుంచి టాకీల వరకు పైడి జైరాజ్ గొప్పగా ప్రస్థానం సాగించారని కేసీఆర్ వివరించారు. భారతీయ వెండితెరపై మొట్టమొదటి యాక్షన్ హీరో పైడి జైరాజ్ అని, అది తెలంగాణకు గర్వకారణం అని పేర్కొన్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా ప్రారంభదశలో ఉన్నప్పుడే ఆయన బాలీవుడ్ లో అగ్రహీరోగా రాణించడం గొప్ప విషయం అని కితాబునిచ్చారు. తనదైన నటనా కౌశలంతో పాటు దర్శకుడిగానూ, నిర్మాతగానూ రాణించి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తొలితరం తెలంగాణ సినిమా నటుడు పైడి జైరాజ్ అని, తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడు అని కేసీఆర్ కొనియాడారు. 

తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలో ఎదిగిన వారిలో పైడి జైరాజ్ ఒకరని కీర్తించారు. ఆయన అందించిన సేవలకు గుర్తుగా రవీంద్రభారతిలోని సమావేశ మందిరానికి 'పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్' అని పేరుపెట్టుకుని గౌరవించుకున్నామని వెల్లడించారు. 

పైడి జైరాజ్ 1909లో సిరిసిల్లలో జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదివిన ఆయన నటనపై ఆసక్తితో 1929లో ముంబయి వెళ్లిపోయారు. తొలుత మూకీ చిత్రాల్లో నటించి, ఆపై టాకీ చిత్రాలతో అలరించారు.

  • Loading...

More Telugu News