Mahesh Babu: సినీ నటుడు మహేశ్ బాబు ఇంట్లో చోరీకి వచ్చి.. గోడదూకి తీవ్రంగా గాయపడిన దొంగ

  • రాత్రి 11.30 గంటల సమయంలో చోరీ కోసం వచ్చిన దొంగ
  • 30 అడుగుల ఎత్తైన గోడ దూకడంతో తీవ్ర గాయాలు
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ గార్డులు
  • ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స
టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఇంట్లో చోరీ కోసం గోడ దూకిన ఓ దొంగ తీవ్ర గాయాలతో కాపలాదారుల చేతికి చిక్కాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందీ ఘటన. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో నివసిస్తున్న మహేశ్ బాబు ఇంటికి కన్నం వేయాలని భావించిన ఓ దొంగ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాలని అనుకున్నాడు. 

అనుకున్నట్టే  గోడ ఎక్కి కిందికి దూకాడు. అయితే, అది చాలా ఎత్తుగా ఉండడంతో కిందపడిన దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు, పెద్ద శబ్దం రావడంతో కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఓ వ్యక్తి గాయాలతో పడి ఉండడంతో పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. 30 అడుగుల ఎత్తైన గోడ పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఘటన జరిగినప్పుడు మహేశ్ బాబు ఇంట్లో లేరు.
Mahesh Babu
Mahesh Babu House
Theft In Mahesh Babu House
Tollywood

More Telugu News