CPI Narayana: సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు.. మోటార్లకు మీటర్లు పెడితే వేళ్లు నరికేయాలని సూచన
- వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే.. జగన్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారన్న నారాయణ
- రాజన్న పాలన అంటే ఇదేనా? అని ప్రశ్న
- 151 మంది ఎమ్మెల్యేలున్న జగన్‌కు ఎందుకంత భయమని నిలదీత
- కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని సూచన
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో నిన్న నిర్వహించిన జిల్లా రైతు సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తండ్రి వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. జగన్ దానిని కాదని మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. రాజన్న పాలన అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను జగన్ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
తెలంగాణలో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని కేసీఆర్ సూచించారని, మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకు భయమెందుకని నిలదీశారు. అప్పట్లో నిజాం నవాబు వస్తే రాజువచ్చాడని, దూరంగా వెళ్లాలని ప్రజలను ఆయన సైన్యం హెచ్చరించేదని, అంతకుమించి వందలాదిమంది పోలీసులతో జగన్ తిరుమలలో పర్యటించారని విమర్శించారు. జగన్ తిరుమల పర్యటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సాగిందని, సీఎంకు ఎందుకంత అభద్రతా భావమని నారాయణ ప్రశ్నించారు.