Kesineni Nani: ఎక్కడో ఉండి తొడలు కొడితే నాయకులు అయిపోతారా?: ఎంపీ కేశినేని నాని

MP Kesineni Nani Fires on YS Jaganmohan Reddy

  • కొందరు మీడియాలో మెరిసి నాయకులు అయిపోవాలని అనుకుంటున్నారని ఎద్దేవా
  • పశ్చిమ నియోజకవర్గ ప్రజలు వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లు వేస్తారన్న ఎంపీ
  • జగన్ వచ్చిన తర్వాత విజయవాడ నాశనమైందని ఆరోపణలు

విజయవాడ పాతబస్తీ జెండా చెట్టు వీధిలో నూతనంగా నిర్మించిన టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని నిన్న టీడీపీ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేశినేని నాని ప్రారంభించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని అన్నారు. కొంతమంది మీడియాలో మెరిసి నాయకులు అయిపోవాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. నాయకులు మీడియా నుంచి కాకుండా ప్రజల నుంచి వస్తారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుల, మతాలకు అతీతమన్నారు. ఇక్కడి ప్రజలు పార్టీని, పార్టీ తరపున పోటీ చేసే వ్యక్తిని కాకుండా అతడి వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లు వేస్తారని అన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా ఎంపీ నాని విరుచుకుపడ్డారు. జగన్ లేకపోతే విజయవాడ లేనే లేదన్నట్టు కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, కానీ నిజానికి జగన్ వచ్చిన తర్వాత విజయవాడ నాశనమైందని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి జగన్ మరో వివాదానికి తెరలేపారని అన్నారు. కాగా, పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం సొంత స్థలాన్ని ఇచ్చిన రాజు సోలంకిని ఎంపీ ప్రశంసించారు. కార్యక్రమం అనంతరం కేశినేని నానిని టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు.

కాగా, ఇటీవల జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తొడకొట్టి మాజీ మంత్రి కొడాలి నానిని ఓడిస్తామని సవాల్ చేసారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News