Team India: మరో ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సూర్యకుమార్
- 2022లో టీ20ల్లో 45 సిక్సర్లు కొట్టిన సూర్య
- ఓ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు రాబట్టిన క్రికెటర్‌గా ఘనత
- 2021లో 42 సిక్సర్లతో టాప్ గా నిలిచిన రిజ్వాన్ రికార్డు బ్రేక్
టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోతున్న భారత బ్యాటర్ సూర్యకుమార్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఆడిన అంతర్జాతీయ టీ20ల్లో సూర్యకుమార్ 45 సిక్సర్లు రాబట్టాడు. దాంతో, ఈ ఫార్మాట్‌లో ఓ ఏడాది అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి తిరువనంతపురంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతను ఈ ఘనత అందుకున్నాడు.
ఈ రికార్డు నిన్నటిదాకా పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 42 సిక్సర్లతో ఓ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు సూర్యకుమార్ అతడిని దాటి ముందుకొచ్చాడు. మరో మూడు నెలల్లో భారత్ మరో 10-15 టీ20లు ఆడనున్న నేపథ్యంలో సూర్య తన రికార్డును మరింత మెరుగు పరుచుకొని ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
టీ20ల్లో నిలకడగా ఆడుతున్న సూర్య ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు దిశగా దూసుకెళ్తున్నాడు. ఐసీసీ టీ20 బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ లో అతను తిరిగి తన అత్యుత్తమ రెండో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం వెల్లడైన ర్యాంకింగ్స్‌లో సూర్య నాలుగు నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో మెరుపు అర్ధ సెంచరీ చేయడం అతనికి కలిసొచ్చింది. సూర్య ఖాతాలో 801 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్ ర్యాంక్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఖాతాలో 861 రేటింగ్ పాయింట్లున్నాయి.