Team India: కెప్టెన్ కూల్‌ను అధిగమించిన హిట్ మ్యాన్
- 2016లో టీమిండియాకు 15 టీ20 విజయాలు అందించిన ధోనీ
- ఆస్ట్రేలియాలో చివరి టీ20 విజయంతో ధోనీకి సమంగా నిలిచిన రోహిత్
- తాజాగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20 విజయంతో ధోనీని దాటేసిన హిట్ మ్యాన్
- రికార్డు కట్టబెట్టిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దక్కిన విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించేలా చేసింది. ఒక ఏడాదిలో టీమిండియాను అత్యధిక టీ20 మ్యాచ్‌లలో గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది.
2016లో ఒకే ఏడాదిలో 15 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాను ధోనీ గెలిపించాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియాకు దక్కిన విజయం రోహిత్ శర్మను ఈ విషయంలో ధోనీ సరసన చేర్చింది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్‌లో విజయంతో హిట్ మ్యాన్ ఖాతాలో కూడా కేలండర్ ఇయర్లో 15 టీ20 విజయాలు నమోదయ్యాయి.
తాజాగా కేరళలోని తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ ఖాతాల్లో 16 విజయాలు చేరాయి. వెరసి కేలండర్ ఇయర్లో టీమిండియాకు అత్యధిక టీ20 విజయాలు అందించిన కెప్టెన్‌గా ఉన్న కెప్టెన్ కూల్‌ను కిందకు నెట్టేసిన హిట్ మ్యాన్ అగ్ర స్థానంలోకి చేరాడు. అయితే, తనకు అరుదైన రికార్డును కట్టబెట్టిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం గమనార్హం.