Congress: సోనియాకు సారీ చెబుతూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్
- సోనియాతో భేటీ అయిన అశోక్ గెహ్లాట్
- పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదన్న రాజస్థాన్ సీఎం
- ఇక దిగ్విజయ్ సింగ్, శశి థరూర్‌ల మధ్యే పోటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరి నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. నేడు ఢిల్లీలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో గెహ్లాట్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియా గాంధీని క్షమాపణలు కోరిన గెహ్లాట్... పార్టీ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయలేనని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన సోనియాతో భేటీ తర్వాత మీడియాకు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలంటూ పార్టీ అధిష్ఠానం నుంచి గెహ్లాట్‌కు ఆహ్వానం అందిన నేపథ్యంలో... ఆయన సోనియా గాంధీతో భేటీ తర్వాత కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి గెహ్లాట్కేనంటూ విశ్లేషణలు సాగుతున్న వేళ... గెహ్లాట్ సొంత రాష్ట్రం రాజస్థాన్‌లో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టే దిశగా కీలక అడుగు వేశారు. ఈ పరిణామం గెహ్లాట్‌ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. తాజాగా గురువారం నాటి భేటీలో సోనియాకు రాజస్థాన్ పరిణామాలపైనే ఆయన క్షమాపణ చెప్పారు. రాజస్థాన్ రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి గెహ్లాట్ తప్పుకున్న నేపధ్యంలో ఇక ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొంది. కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజయ్ సింగ్, శశి థరూర్‌ల మధ్యే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. అదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెహ్లాట్‌ను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై త్వరలోనే సోనియా గాంధీ నిర్ణయం తీసుకోనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.