Ashok Gehlot: రాజస్థాన్ సీఎంపై సోనియా రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు: కేసీ వేణుగోపాల్

KC Venugopal says Sonia Gandhi decides Rajasthan CM issue in one or two days

  • కాంగ్రెస్ అధ్యక్ష రేసులో బలంగా నిలిచిన గెహ్లాట్
  • అనూహ్యరీతిలో రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం
  • సచిన్ పైలెట్ సీఎం అయితే సహించేది లేదన్న గెహ్లాట్ వర్గం
  • సోనియాకు క్షమాపణలు తెలిపిన గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకల పట్ల పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణలు తెలిపారు. ఇప్పుడాయన సీఎం పదవి సోనియా నిర్ణయంపై ఆధారపడి ఉంది. 

నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కాబోయే జాతీయ అధ్యక్షుడు అశోక్ గెహ్లాటేనని ప్రచారం జరిగింది. ఆయన కూడా బలంగా రేసులో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం ఒకరికి ఒకే పదవి కావడంతో, సీఎం పదవికి రాజీనామా చేసేందుకు గెహ్లాట్ సిద్ధపడ్డారు. కానీ 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడడంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం తలెత్తింది. 

కొనసాగిస్తే అశోక్ గెహ్లాట్ నే సీఎంగా ఉంచాలని, లేని పక్షంలో సచిన్ పైలెట్ కు తప్ప మరెవరికైనా సీఎం పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2020లో పార్టీలో తీవ్ర సంక్షోభానికి కారణమైన సచిన్ పైలెట్ సీఎం కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వారు తేల్చి చెప్పారు. 

ఈ పరిణామాలతో అశోక్ గెహ్లాట్ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై అధిష్ఠానానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కాదు కదా, ఇటు సీఎం పదవి కూడా పోయే పరిస్థితి వచ్చిపడింది.

రాజస్థాన్ సీఎం అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News