Mallikarjun Kharge: ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. చివరి క్షణంలో ఖర్గే ఎంట్రీ ఇచ్చే అవకాశం!

Mallikarjun Kharge Makes Last Minute Entry
  • ఇప్పటికే ఎన్నికల బరిలో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్
  • నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి రోజు
  • ఖర్గే వైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాబోయే అధ్యక్షుడు అశోక్ గెహ్లాటే అని అందరూ భావిస్తున్న తరుణంలో ఊహించని విధంగా ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు. నామినేషన్ వేయడానికి ఈరోజే చివరి రోజు. 

అయితే, ఏ క్షణంలో అయినా మరో కీలక మలుపు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. చివరి క్షణంలో మల్లికార్జున ఖర్గే తెరపైకి రావచ్చని అంటున్నారు. అధ్యక్ష పదవి కోసం ఆయన పోటీ పడొచ్చని సమాచారం. పార్టీ అధిష్ఠానం ఖర్గే వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఒక పదవి నిబంధనలో భాగంగా రాజ్యసభలో విపక్షనేత పదవికి ఖర్గే రాజీనామా చేస్తారని అంటున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో ముగ్గురు నేతలు నిలిచినట్టు అవుతుంది. 

ఈ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లకు గడువు ముగుస్తుంది. దీంతో, ముగ్గురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు వేయనున్నారు. అయితే, అభ్యర్థుల మధ్య పోటీ స్నేహపూర్వకంగానే ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. 

అధ్యక్ష పదవికి మీరు పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటూ నిన్న రాత్రి ఖర్గేకు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అయితే, ఎన్నిక వ్యవహారంలో హైకమాండ్ తటస్థంగా ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు చివరి క్షణంలో ఖర్గే రూపంలో కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.
Mallikarjun Kharge
Digvijay Singh
Shashi Tharoor
Congress

More Telugu News