Congress: నామినేషన్లు దాఖలు చేసిన ఖర్గే, థరూర్... ఖర్గే ఎన్నిక లాంఛనమేనంటూ కథనాలు
- రాజీవ్‌కు నివాళి అర్పించి నామినేషన్ వేసిన థరూర్
- గెహ్లాట్ సహా సీనియర్లు వెంట రాగా నామినేషన్ వేసిన ఖర్గే
- ఖర్గే ఎన్నిక ఖాయమేనంటూ విశ్లేషణలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో శుక్రవారం ఓ కీలక ఘట్టం పూర్తయింది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌లు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తొలుత శశి థరూర్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళి అర్పించి తన నామినేషన్ దాఖలు చేయగా... ఆ తర్వాత కాసేపటికే ఖర్గే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు నేతలు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పోలింగ్ అనివార్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉన్నా... థరూర్, ఖర్గేలు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే... అధ్యక్ష పదవికి ఖర్గే ఎన్నికవడం ఖాయమేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఖర్గే నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన వెంట బరి నుంచి తప్పుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పెద్ద సంఖ్యలో నేతలు ఉన్నారు. అంతేకాకుండా సామాజిక సమీకరణాలు తీసుకున్నా... దళిత వర్గానికి చెందిన ఖర్గేకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.