Nitin Gadkari: మీ కారును నేను కూడా భరించలేను: మెర్సిడెస్ బెంజ్ తో నితిన్ గడ్కరీ
- బెంజ్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు
- ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 335 శాతం పెరిగాయన్న గడ్కరీ
- దేశంలో ప్రస్తుతం 15.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని వెల్లడి
జర్మనీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తయారు చేసే వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. అయితే ఈ కార్లను సామాన్యుడు సొంతం చేసుకోలేడు. వీటి ఖరీదు చాలా ఎక్కువ కావడమే దీనికి కారణం. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ కారు ధరను తాను కూడా భరించలేనని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. పూణెలో మెర్సిడెస్ బెంజ్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మీ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని... ఉత్పత్తిని పెంచితేనే ధరలను కొంచెం తగ్గించడం సాధ్యమవుతుందని గడ్కరీ అన్నారు. తామంతా మధ్య తరగతి ప్రజలమని... తాను కూడా మీ కారు ధరను భరించలేనని చెప్పారు. బెంజ్ తయారు చేసిన ఎలెక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లుగా ఉంది. ప్రస్తుతం దేశంలో 15.7 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 335 శాతం పెరిగాయని చెప్పారు. దేశంలో ఎక్స్ ప్రెస్ హైవేలు వస్తుండటం వల్ల ఈవీ కార్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అన్నారు.