Chiranjeevi: రాజమౌళి దర్శకత్వంలో నటించడంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
- మన దేశ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి రాజమౌళి అని కొనియాడిన చిరు
- ఆయన కోరుకునే ఔట్ పుట్ ను తాను ఇవ్వగలనో, లేదో అని వ్యాఖ్య
- రాజమౌళికి ఏళ్లపాటు సమయం ఇవ్వలేనన్న చిరు
ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా చిరంజీవితో టాప్ డైరెక్టర్లు చేస్తే చూడాలనుకుంటారు. మరోవైపు, మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. తాజాగా తన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ... రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడని... మన దేశ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని చిరంజీవి కొనియాడారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా లోతుగా చూస్తారని, ప్రతి ఒక్కటి ఎంతో పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తారని... ఆయన కోరుకునే ఔట్ పుట్ ను ఒక నటుడిగా తాను ఇవ్వగలనో, లేదో తనకు తెలియదని చెప్పారు. మరోవైపు రాజమౌళి ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తెరకెక్కిస్తారని... ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదేళ్ల పాటు తీసుకుంటారని... అంత సమయాన్ని తాను ఇవ్వలేనని అన్నారు. ప్రస్తుతం తాను ఒకే సారి నాలుగు చిత్రాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కారణం వల్లే రాజమౌళితో సినిమా చేయాలని కానీ, పాన్ ఇండియా స్థాయి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కానీ తనకు లేదని తెలిపారు. ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు.
మరోవైపు మెగాస్టార్ తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు.