Congress: కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి ఖ‌ర్గేకు ఖాయ‌మైన‌ట్టేనా?

Mallikarjun Kharge resigns as Leader of Opposition in Rajya Sabha
  • రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే రాజీనామా
  • రాజీనామాను సోనియా గాంధీకి పంపిన ఖ‌ర్గే
  • పార్టీని న‌డిపే బాధ్య‌త తీసుకునేందుకే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం
కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి గాంధీ కుటుంబ విధేయుడు, సీనియ‌ర్ నేత మల్లికార్జున్ ఖర్గేనే వ‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత ఆయ‌న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయ‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. పార్టీలో ఒకే వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి ఉండాల‌ని కాంగ్రెస్ ఉద‌య్‌పూర్ తీర్మానాన్ని అనుసరించి, ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టేందుకే ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ప‌ద‌విని వ‌దులుకున్న‌ట్టు తెలుస్తోంది. రాజ్య‌స‌భ‌లో ఖర్గే స్థానంలో ఈ బాధ్య‌త‌లు అందుకునేందుకు పి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్ రేసులో ఉన్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శుక్రవారం మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్, కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఖర్గే అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇస్తామని జి-23 నేతలు పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపిందర్ హుడా ప్రకటించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అత్యున్నత పదవికి పోటీలో ఉన్న దిగ్విజయ సింగ్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని చివ‌రి నిమిషంలో ప్ర‌క‌టించారు. తన బ‌దులు సీనియర్ మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తానని ప్రకటించారు.
Congress
President
mallikhajun kharge
resign
Leader of Opposition
Rajya Sabha

More Telugu News