Zero Gravity: 20 వేల అడుగుల ఎత్తులో ఫుట్ బాల్ మ్యాచ్.. గాల్లో తేలుతూ ఆటగాళ్ల గోల్స్.. వీడియో ఇదిగో
- పారాబొలిక్ విమానంలో 20,230 అడుగుల ఎత్తున ఫుట్ బాల్ మ్యాచ్
- ప్రత్యేకంగా చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి విమానంలో నిర్వహణ
- జీరో గ్రావిటీలో గాల్లో తేలిపోతూ ఫుట్ బాల్ ఆడిన ఆటగాళ్లు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజే వేరు. భారీ మైదానాల్లో వేలాది మంది ప్రేక్షకుల మధ్య వీక్షకుల ఉత్సాహం మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతుంటాయి. ఇవన్నీ సాధారణమే. కానీ ఓ ఫుట్ బాల్ మ్యాచ్ మాత్రం అన్నింటికన్నా విభిన్నంగా జరిగింది. ఏకంగా ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో, అదీ గాల్లో తేలిపోతూ జీరో గ్రావిటీలో జరిగిన మ్యాచ్. ఓ విమానంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్.
రెడ్, ఎల్లో టీమ్ లుగా..
అది చిన్నపాటి ఫుట్ గ్రౌండ్ గా మార్చిన ప్రత్యేక విమానం. అందులో ఏడుగురు అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటగాళ్లు. మరొక వెటరన్ ప్లేయర్ కలిసి రెండు టీమ్ లుగా విడిపోయారు. రెడ్ టీమ్ ఓ వైపు, ఎల్లో టీమ్ ఓ వైపు. మధ్యలో రిఫరీలు, కెమెరామెన్లు.
విమానం 20,230 అడుగుల ఎత్తులోకి వెళ్లాక పారాబోలిక్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్లింది. అంటే ఉన్నట్టుండి అతి వేగంతో విమానాన్ని పైకి తీసుకెళ్లి, మళ్లీ అంతే వేగంతో కిందికి తీసుకురావడం అన్నమాట.
- ఈ సమయంలో విమానంలో తాత్కాలికంగా జీరో గ్రావిటీ (భూమ్యాకర్షణ రహిత) పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆటగాళ్లు గాల్లో తేలిపోతూ.. ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు.
- మ్యాచ్ లో బాల్ ను తన్నడం, తలతో తోయడంతో పాటు తోటి ఆటగాళ్లు పట్టుకుని విసరి.. బంతిని తాకేలా చేసి గోల్ చేయడం వంటి ఫీట్లనూ చేశారు. చాలా భిన్నంగా సాగిన ఈ పోటీలో రెడ్ టీమ్ విజయం సాధించింది.
- మొత్తంగా ప్రపంచంలోనే మొదటిసారిగా అత్యంత ఎక్కువ ఎత్తులో, భార రహిత స్థితి (జీరో గ్రావిటీ)లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ గా ఇది రికార్డులకు ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- ఈ మ్యాచ్ లో పాల్గొన్న ప్రఖ్యాత ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఆటగాడు ఫిగో మాట్లాడుతూ.. ‘‘ఫుట్ బాల్ ప్రపంచ దేశాల సరిహద్దులను చెరిపేసి ప్రజలందరినీ ఐక్యం చేస్తుంది. అలా నేను చాలా మైదానాల్లో ఫుట్ బాల్ ఆడాను. కానీ ఇప్పుడు భూమి నుంచి ఏకంగా 20 వేల అడుగులపైన ఎత్తులో ఫుట్ బాల్ ఆడటం అద్భుతంగా అనిపిస్తోంది..” అని పేర్కొన్నారు.
- మాస్టర్ కార్డ్ సంస్థ స్పాన్సర్ చేసిన ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోను ఆ సంస్థ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. దానికి భారీగా వ్యూస్ వస్తున్నాయి.