Little boy: చదివీ చదివీ ముసలాడు అయిపోతాడట.. చదవడానికి మారాం చేస్తున్న చిన్నారి వీడియో ఇదిగో
- చేతిలో పుస్తకం, పెన్సిల్ పట్టుకుని కూర్చున్న చిన్నారి
- ఎందుకు చదవవని తల్లి అడిగితే.. జీవితాంతం చదువేనా అన్నట్టు మాట్లాడిన వైనం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఐదు లక్షలకుపైగా వ్యూస్
చాలా చోట్ల ఇళ్లలో పిల్లలు మారాం చేయడం మామూలే. అన్నం తినడానికి కొందరు, ఏదైనా చెబితే చేయడానికి మరికొందరు మారాం చేస్తుంటారు. ఇక చదువుకొమ్మంటే లేదని మారాం చేసే పిల్లలూ చాలా ఎక్కువ. బడికి వెళ్లే మొదటి దశలో చాలా మంది పిల్లలు ఇంటిని వదిలి అంతసేపు ఉండలేకపోవడంతోనో, ఆడుకోవాలని అనిపించో.. పలక, పుస్తకం పట్టడానికి నిరాకరిస్తుంటారు. తాము చదవబోమని, ఆడుకుంటామని పట్టుపడుతుంటారు. అలాంటి ఓ చిన్నారి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంత సేపు చదవాలి..?
ఓ చిన్నారి.. సుమారు నాలుగేళ్లు ఉంటాయి. చేతిలో పుస్తకం, పెన్సిల్ పట్టుకుని కూర్చుంటాడు. అతడిని చదవాలని తల్లి చెప్తుంటే.. బుంగమూతి పెట్టుకుని తాను చదవబోనని మారాం చేస్తుంటాడు. ఎందుకు చదవవు, ఏమైంది అని అడిగితే.. ‘‘ఎంత సేపు చదవాలి. జీవితాంతం చదివీ, చదివీ ముసలాడిని అయిపోయేలా ఉన్నాను (జిందగీ భర్ పడాయి కర్తే కర్తే బుడ్డా హో జావూంగా..) ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
- ఈ వీడియోను గుల్జార్ సాహబ్ అనే యూజర్ ట్విట్టర్ లో పెట్టగా వైరల్ గా మారింది. ఐదు లక్షలకుపైగా వ్యూస్ రాగా.. వేల కొద్దీ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
- చదువు మీద పిల్లాడు చెప్పిన విషయం విని ‘మంచి పాయింటే చెప్పాడు’ అని కొందరు అంటుంటే.. ‘చదవకుంటే ఎట్లా మరి’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ‘‘పిల్లాడు ముద్దుముద్దుగా చెప్తున్న విషయం వింటుంటే నవ్వకుండా ఉండలేకపోతున్నాం” అని ఇంకొందరు పేర్కొంటున్నారు.
- ‘‘పిల్లలు ఆటాడుకుంటూ నేర్చుకునేలా ఉంటే మారాం చేయరు. వారు చేసిన కొద్దీ, నేర్చుకున్న కొద్దీ మెచ్చుకుంటూ ఉంటే మారాం చేయకుండా చేస్తారు..” అని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.