Aasha: ఆ వార్తలు నిజం కావు.. చీతా గర్భం దాల్చిందన్న వార్తలను కొట్టిపడేసిన కునో పార్క్ అధికారులు

One of Kunos cheetahs Aasha may be pregnant and park official denies news

  • నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు రాక
  • కునో నేషనల్ పార్క్‌లో వాటిని వదిలిపెట్టిన మోదీ
  • ‘ఆశ’ అనే చీతా గర్భం దాల్చినట్టు అనుమానంగా ఉందన్న సీసీఎఫ్‌కు చెందిన డాక్టర్ లారీ మార్కెర్
  • అవి పూర్తిగా నిరాధార వార్తలన్న కునో పార్క్ అధికారి

నమీబియా నుంచి ఇటీవల భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటి గర్భం దాల్చినట్టు వచ్చిన వార్తలను కునో నేషనల్ పార్క్ అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా సెప్టెంబరు 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్రమోదీ విడిచిపెట్టారు. 

నమీబియా నుంచి వచ్చిన ఈ 8 చీతాల్లో ‘ఆశ’ అనే చీతా గర్భం దాల్చినట్టు నిన్న జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.  చీతా గర్భం దాల్చి ఉండొచ్చని అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని చీతా కన్జర్వేషన్ ఫండ్ (సీసీఎఫ్) కు చెందిన డాక్టర్ లారీ మార్కెర్ తెలిపారు. తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలని పేర్కొన్న ఆమె.. నిజంగా అది గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే నమీబియా నుంచి భారత్‌కు మరో బహుమతి అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఆశా  గర్భం దాల్చడానికే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉందన్నారు. ఒకవేళ ఆశా కనుక పిల్లలకు జన్మనిస్తే దానికి మరింత ప్రైవసీ కావాల్సి ఉంటుందని, దానికి మనుషులు కనిపించకుండా చూడాల్సి ఉంటుందని అన్నారు. 

అయితే, ఆశ గర్భం దాల్చిందన్న వార్తలను కునో నేషనల్ పార్క్ కొట్టేవేసింది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, దానికెలాంటి పరీక్షలు నిర్వహించలేదని, అది గర్భం దాల్చినట్టుగా రిపోర్టులేమీ రాలేదని కునో నేషనల్ పార్క్ అధికారి ప్రకాష్ కుమార్ వర్మ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News