PV Sindhu: గుజరాతీ దుస్తులు ధరించి నవరాత్రి వేడుకల్లో డ్యాన్స్ చేసిన పీవీ సింధు
- జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల కోసం గుజరాత్ వెళ్లిన సింధు
- అహ్మదాబాద్, సూరత్ లో నవరాత్రి వేడుకలకు హాజరైన తెలుగు తేజం
- సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి అలరించిన సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ఆటతో కోర్టులో ప్రత్యర్థులను గడగడలాడిస్తుంది. ఆమె ఆట ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు తనలోని మరో ప్రతిభను సింధు బయట పెట్టింది. జాతీయ క్రీడల ప్రారంభోత్సవం కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఆమె రెండు రోజుల నుంచి అక్కడే ఉంది. ఈ సందర్భంగా అహ్మదాబాద్, సూరత్ లో దేవీ నవరాత్రుల వేడుకలకు హాజరైంది. గుజరాత్ సంప్రదాయ దుస్తులు ధరించిన ఆమె.. అక్కడి గర్బా నైట్స్ లో మహిళలతో కలిసి డ్యాన్స్ చేసి అలరించింది. దిగ్గజ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండేతో కలిసి సింధు గర్బా ఈవెంట్‌కు హాజరై వారితో కలిసి కాలు కదిపించింది. అనంతరం సూరత్‌లో కూడా ఈ వేడుకకు హాజరైన ఆమె పురుషుల సింగిల్స్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్, డబుల్స్ స్టార్ చిరాగ్ శెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన సింధు అందరినీ అలరించింది.
గతేడాది ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు, ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకుంది. గాయం వల్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పాల్గొనని సింధు.. జాతీయ క్రీడల్లో సైతం ఆడటం లేదు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రెండు రోజులుగా జాతీయ క్రీడల ప్రాంగణంలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. శనివారం బ్యాడ్మింటన్ పోటీలను ఆమె ప్రారంభించింది.