Punjab: పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుడు
- పంజాబ్ మన్సా జిల్లా పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన దీపక్ టిను
- గోయింద్వాల్ జైలు నుంచి తీసుకొస్తుండగా శనివారం రాత్రి ఘటన
- పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు పోలీసుల ప్రకటన
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన దీపక్ టిను పంజాబ్ మాన్సా జిల్లా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మాన్సా పోలీసులు మరో కేసులో గోయింద్వాల్ సాహిబ్ జైలు నుంచి ప్రొడక్షన్ వారెంట్‌పై తీసుకుస్తుండగా శనివారం రాత్రి టినూ తప్పించుకున్నాడని తెలిపాయి. టినుని పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సన్నిహితుడైన టిను మూసేవాలా హత్య కేసులో అరెస్టయ్యాడు. తమ కస్టడీ నుంచి తప్పించుకున్న టినును తొందర్లోనే పట్టుకుంటామని బటిండా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖ్విందర్ సింగ్ చినా తెలిపారు.
మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ ను దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితుడు, బంధువుతో కలిసి జీపులో మాన్సాలోని జవహర్ కే గ్రామానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. అతని వాహనాన్ని దారి మళ్లించి ఆరుగురు షూటర్లు బుల్లెట్ల వర్షం కురిపించడంతో మూసేవాల అక్కడిక్కడే చనిపోయాడు. ఈ హత్య తామే చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ప్రకటించాడు. ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసిన 24 మంది నిందితుల్లో టినూ కూడా ఉన్నాడు.