Rahul Gandhi: కశ్మీర్ వరకు యాత్ర కొనసాగి తీరుతుంది.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: జోరు వర్షంలోనూ రాహుల్ ప్రసంగం

Crowd cheers as Rahul Gandhi addresses rally amid heavy rains in Mysuru
  • నిన్న మైసూరులో కొనసాగిన ‘భారత్ జోడో’ యాత్ర
  • జోరు వర్షంలోనూ కొనసాగిన చేరికలు
  • ఆయనతోపాటే ముందుకు నడిచిన జనం
  • గాంధీ అడుగు జాడల్లో నడవడం బీజేపీకి కష్టంగా ఉందని విమర్శించిన రాహుల్
భారత్‌ను ఏకం చేయడంలో తమను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు ఆయన చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర నిన్న 25వ రోజున మైసూరులో కొనసాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం ఆయనతోపాటు ముందుకు సాగారు. సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనూ ప్రసంగిస్తున్న రాహుల్‌ను చూసి జనం కరతాళ ధ్వనులతో మరింత ఉత్సాహాన్ని నింపారు. వర్షం కురుస్తుండగానే పార్టీలో చేరిక ప్రక్రియ కొనసాగింది. 

జోరు వర్షంలోనూ ప్రసంగాన్నికొనసాగించిన రాహుల్ అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘భారత్‌ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారత గొంతుకను వినిపించడంలో ఎవరూ మమ్మల్ని నిలువరించలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగే యాత్రను ఎవరూ ఆపలేరు’’ అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ అంతకుముందు ఖాదీ గ్రామోదయ కేంద్రంలో మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గాంధీ సిద్ధాంతాలను బాగానే వల్లిస్తున్నారని, కానీ ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం వారికి కష్టంగా ఉందని విమర్శించారు.
Rahul Gandhi
Mysore
Bharat Jodo Yatra
Congress

More Telugu News