BCCI: భారత జట్టులో చోటు దక్కకపోవడంతో యువ క్రికెటర్ కలత.. వారి మాటలు నమ్మొద్దంటూ పోస్ట్
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
- కెప్టెన్ గా శిఖర్ ధావన్ ఎంపిక.. పృథ్వీ షాకు దక్కని చోటు
- పరోక్షంగా బీసీసీఐ, సెలెక్టర్లను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పృథ్వీ విమర్శనాత్మక కామెంట్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో భారత యువ బ్యాటర్ పృథ్వీ షా నిరాశ చెందాడు. ఇన్‌స్టాగ్రామ్ లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. పరోక్షంగా బీసీసీఐ, సెలెక్టర్లను ఉద్దేశించి తన ఇన్ స్టాగ్రామ్‌లో విమర్శనాత్మక పోస్ట్ చేశాడు. "వారి మాటలను నమ్మవద్దు, వారి చర్యలనే విశ్వసించాలి. ఎందుకంటే వాళ్లు చెప్పే మాటలు అర్థం లేనివి అని వారి చర్యలు రుజువు చేస్తాయి" అని షా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది.
పేలవ ఫామ్ కారణంగా భారత జట్టుకు దూరమైన షా.. కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫున సత్తా చాటుతూ వార్తల్లో నిలిచాడు. ఈ మధ్య దులీప్ ట్రోఫీలో నార్త్-ఈస్ట్ జోన్‌పై వెస్ట్ జోన్ తరపున సెంచరీ చేశాడు. అలాగే, తన ఫిట్‌నెస్ ను కూడా మెరుగు పరుచుకున్న షా.. భారత జట్టులోకి తిరిగి రావాలని ఊవిళ్లూరుతున్నాడు. కానీ, సెలెక్టర్లు మరోసారి మొండి చేయి చూపెట్టడంతో తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు.
కాగా, దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆలిండియా సెలెక్షన్ కమిటీ ఆదివారం జట్టును ప్రకటించింది, ఆ జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తాడు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రజత్ పటీదార్, ముఖేష్ కుమార్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టులో భాగమైన అగ్ర శ్రేణి ఆటగాళ్లంతా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు.
భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, సిరాజ్, దీపక్ చాహర్.