QR code: మీరు కొంటున్న మెడిసిన్ అసలైనదా? నకిలీదా ఇలా తెలుసుకోవచ్చు..
- మందుల ప్యాక్ లపై క్యూఆర్ కోడ్ విధానం
- దాన్ని ఫోన్ తో స్కాన్ చేసి తెలుసుకునే ఏర్పాటు
- తొలి దశలో 300 బ్రాండెడ్ ఔషధాలకు అమలు
థైరాయిడ్ కోసం ఎక్కువ మంది వినియోగిస్తున్న ‘థైరోనార్మ్’ అనే మెడిసిన్ (బ్రాండ్ పేరు) పేరుతో పెద్ద మొత్తంలో నకిలీ ఔషధ విక్రయాలు కొనసాగుతున్నట్టు ఇటీవలే వెలుగు చూసింది. అబాట్ కంపెనీకి చెందిన ఉత్పత్తి ఇది. కానీ, ఈ కంపెనీ ఉత్పత్తిని అదే పేరుతో నకిలీ తయారు చేసి భారీగా తెలంగాణలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఉదంతంతో మనం ఫార్మసీల్లో కొనుగోలు చేస్తున్న మందులు అసలైనవేనా? లేక నకిలీవా? అనే సందేహం రాక మానదు. ఇదొక్కటే కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనికి పరిష్కారం అతి త్వరలో రానుంది.
కొనుగోలు చేసే ఔషధంపై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ (క్యూఆర్) ఉంటుంది. దాన్ని ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు ఆ ఔషధం అసలైనదో, కాదో తెలుస్తుంది. తొలి దశలో ఎక్కువగా అమ్ముడుపోయే 300 ఔషధాలకు త్వరలోనే ఇది అమలు కానుంది. రూ.100కు పైన ధర ఉండే వాటికి తొలుత అమలు చేయనున్నారు. దీన్ని ట్రాక్ అండ్ ట్రేస్ గా పిలవనున్నారు. వాస్తవానికి దశాబ్దం కిందటే ఈ ఆలోచన మొగ్గతొడిగింది. కానీ, ఫార్మా పరిశ్రమ సన్నద్ధం కాకపోవడంతో పక్కన పడిపోయింది. ఎగుమతి చేసే ఉత్పత్తులకు కూడా ఈ క్యూఆర్ కోడ్ విధానం వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. క్యూఆర్ కోడ్ వల్ల 3-4 శాతం అదనపు ఖర్చు అవుతుందని పరిశ్రమ అంటోంది.