Onion: ఉల్లిపాయలతో మధుమేహం నియంత్రణ.. తాజా పరిశోధనలో గుర్తింపు!
- ఎలుకలపై చేసిన పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చాయన్న శాస్త్రవేత్తలు
- ఉల్లిపాయల్లోని ‘అల్లియమ్ సెపా’ అనే పదార్థం కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తోందని వెల్లడి
- త్వరలో మనుషులపై ప్రయోగం చేయనున్నట్టు వివరణ
కొన్నేళ్లుగా మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం వంటి వాటి వల్ల మధుమేహం బాధితులు పెరిగిపోతున్నారు. ఒక్కసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మన రక్తంలో చక్కెర స్థాయిలను, రక్త పోటును నియంత్రించడంలో తోడ్పడుతాయి. అలా ఉల్లిపాయలు మధుమేహం నియంత్రణకు తోడ్పడుతాయని తాజాగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు.
ఎండోక్రైన్ సొసైటీ సమావేశంలో..
అమెరికాలోని శాన్ డియాగోలో ఇటీవల జరిగిన 97వ ది ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలు ఉల్లిపాయలు, మధుమేహంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఉల్లిలోని ‘అల్లియమ్ సెపా’ అనే పదార్థం మన రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గించేందుకు తోడ్పడుతున్నట్టు తాము గుర్తించినట్టు వెల్లడించారు. అంతేగాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచడంలోనూ పనిచేస్తున్నట్టు తెలిపారు.
ఎలుకలపై పరిశోధన చేసి..
ఈ అంశానికి సంబంధించి ఎలుకలపై పరిశోధన చేశామని శాస్త్రవేత్తలు వివరించారు. మొత్తం నాలుగు గ్రూపులుగా ఎలుకలను తీసుకున్నామని.. అందులో ఒక గ్రూపు మధుమేహం లేని ఎలుకలు అని చెప్పారు. మధుమేహం ఉన్న మూడు గ్రూపుల్లోని ఎలుకలకు.. ఉల్లి నుంచి తీసిన పదార్థాలను వేర్వేరు డోసుల్లో అందించి పరిశీలించామని తెలిపారు.
మధుమేహం ఉన్న మూడు గ్రూపుల్లోని ఎలుకల్లో.. ‘అల్లియమ్ సెపా’ డోసు ఎక్కువగా ఇచ్చిన గ్రూపులో రక్తంలో చక్కెర స్థాయిలు బాగా నియంత్రణలో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అదే సమయంలో వాటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గాయని వివరించారు.
ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల మరో లాభం కూడా ఉందని.. వాటి వల్ల పెద్దగా కెలోరీలు కూడా అందకపోవడం వల్ల అంతిమంగా శరీరంలో గ్లూకోజ్ శాతం పెరిగే పరిస్థితి కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి మనుషులపైనా ప్రయోగాలు చేయాల్సి ఉందని వివరించారు.