Royal Enfield: సెప్టెంబరు మాసంలో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల మోత
- 145 శాతం అమ్మకాల వృద్ధి
- సెప్టెంబరులో 82 వేల యూనిట్ల విక్రయం
- గతేడాది సెప్టెంబరులో 33 వేల బైకుల విక్రయం
- ఎగుమతుల పరంగానూ 34 శాతం వృద్ధి నమోదు
భారీ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు ఆశాజనక రీతిలో కొనసాగుతున్నాయి. సెప్టెంబరు మాసంలో రాయల్ ఎన్ ఫీల్డ్ 145 శాతం అమ్మకాల వృద్ధి సాధించింది. సెప్టెంబరులో 82,097 బైకులు విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే నెలలో రాయల్ ఎన్ ఫీల్డ్ కేవలం 33,529 బైకులు విక్రయించింది.
ఈ ఏడాది సెప్టెంబరులో 8,451 బైకులు ఎగుమతి చేయగా, గతేడాది ఇదే నెలలో 6,296 బైకులు ఎగుమతి చేసింది. ఎగుమతుల పరంగానూ రాయల్ ఎన్ ఫీల్డ్ 34 శాతం వృద్ధి నమోదు చేసింది.
రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ స్పందిస్తూ, పండుగ సీజన్ లో శుభారంభం లభించిందని తెలిపారు. ఇటీవలే తాము విడుదల చేసిన హంటర్ 350 మోడల్ కు విశేష స్పందన వస్తోందని వెల్లడించారు. ఈ కొత్త బైక్ ద్వారా మార్కెట్లో తమకు మరిన్ని అమ్మకాలు నమోదవుతాయని భావిస్తున్నామని వివరించారు.