Jaspreet Bumrah: టీ20 వరల్డ్ కప్ కు బుమ్రా దూరం... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
- వీపు గాయంతో బాధపడుతున్న బుమ్రా
- ఇప్పటికే దక్షిణాఫ్రికాతో సిరీస్ కు దూరం
- తాజాగా వరల్డ్ కప్ కు కూడా అందుబాటులో లేని వైనం
టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అనిశ్చితి వీడింది. బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బుమ్రా పరిస్థితిని నిపుణులైన వైద్యబృందం పరిశీలించిందని, అతడు వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు లేవని ఆ బృందం నిర్ధారించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
వీపు గాయంతో బుమ్రా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. వరల్డ్ కప్ లో బుమ్రా వంటి బౌలర్ లేకపోతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని టీమిండియా మేనేజ్ మెంట్ కు తెలియందికాదు. టోర్నీలోపు కోలుకుంటే బాగుండని కోరుకుంది. అందుకే అతడి గాయంపై తుది నివేదిక వచ్చేంత వరకు వేచిచూడాలని నిర్ణయించుకుంది. బుమ్రా ఇంకా వరల్డ్ కప్ కు దూరం కాలేదంటూ కోచ్ ద్రావిడ్ ఇటీవల పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ అధికారిక ప్రకటనతో బుమ్రా ఇక వరల్డ్ కప్ లో ఆడబోవడంలేదని తేలిపోయింది.
టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనుంది. టీమిండియా ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అక్టోబరు 23న ఆడనుంది. పేస్ కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్ లపై బుమ్రా ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.