Hindu Temple: దుబాయ్ లో 16 మంది దేవతామూర్తులతో భారీ హిందూ ఆలయం... నేడు ప్రారంభం
- అరబ్ గడ్డపై హిందూ దేవాలయం
- 80 వేల చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం
- 2019లో స్థలం కేటాయించిన యూఏఈ ప్రభుత్వం
- మూడేళ్లలో నిర్మాణం పూర్తి
ఇస్లామిక్ దేశాల్లో హిందూ దేవాలయాలు చాలా అరుదు. అయితే, దుబాయ్ లో 16 మంది దేవతామూర్తులతో కూడిన భారీ హిందూ దేవాలయం నిర్మించారు. నేడు ఈ ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ హాజరుకానున్నారు.
కాగా, ఈ భారీ ఆలయ నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. ఈ ఆలయానికి అన్ని రకాల అనుమతులు లభించాయి. యూఏఈ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణం కోసం 2019లో స్థలం కేటాయించింది. 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించారు.
దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో వర్షిప్ విలేజ్ ఏరియాలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు, కృష్ణుడు, వినాయకుడు, మహాలక్ష్మి మూలవిరాట్టులతో పాటు సిక్కుల పరమ పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ కూడా ఉంది. ఆలయం పైఅంతస్తులో 105 కంచు గంటలు ఏర్పాటు చేశారు.
దుబాయ్ లో ఉన్న హిందూ దేవాలయాల్లో ఇది రెండవది. మొదటి ఆలయాన్ని 1958లో నిర్మించారు. ఈ హిందూ దేవాలయంలోకి అన్ని మతాల ప్రజలు రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి.