Telangana: తెలంగాణ సర్కారీ దవాఖానాలో పండంటి బాబుకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి
- ములుగు జిల్లా జేసీగా పనిచేస్తున్న త్రిపాఠి
- జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా ఆమె భర్త భవేశ్ మిశ్రా
- ప్రసవం నిమిత్తం త్రిపాఠిని సర్కారీ ఆసుపత్రికి తీసుకెళ్లిన మిశ్రా
- సిజేరియన్ ఆపరేషన్ చేసిన ఆసుపత్రి వైద్యులు
తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుతం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన త్రిపాఠి ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ జిల్లాకు పొరుగునే ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఆమె భర్త భవేశ్ మిశ్రా పనిచేస్తున్నారు. త్రిపాఠికి సోమవారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం కాగా... ఆమెను భవేశ్ మిశ్రా భూపాలపల్లిలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజీవయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్‌లను రప్పించారు. సాధారణ ప్రసవానికే వైద్యులు యత్నించగా.. గర్భంలోని మగ శిశువు బరువు అధికంగా ఉండటంతో సోమవారం రాత్రి సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు త్రిపాఠికి ప్రసవం చేశారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. రాష్ట్రంలో సర్కారీ ఆసుపత్రుల్లో పెరిగిన వసతులకు నిదర్శనమే ఈ ఘటన అని అధికార టీఆర్ఎస్‌కు చెందిన నేతలు చెబుతున్నారు.