Mikhail Shargin: జేఈఈ మెయిన్ పరీక్షలో చీటింగ్ చేసేందుకు 820 మంది విద్యార్థులకు సహకారం అందించిన రష్యన్ హ్యాకర్
- గతేడాది సెప్టెంబరులో జేఈఈ మెయిన్
- సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ కు పాల్పడిన రష్యా హ్యాకర్
- అరెస్ట్ చేసిన సీబీఐ
- కోర్టులో హాజరు
గతేడాది జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ అనే హ్యాకర్ ను సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. షార్గిన్ ను విచారించిన సీబీఐ కొంతమేర సమాచారం రాబట్టింది. ఆన్ లైన్ స్టిసమ్ లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఈ రష్యన్ హ్యాకర్ 820 మంది విద్యార్థులకు సహకరించినట్టు వెల్లడైంది.
గతేడాది సెప్టెంబరులో 9 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ రాశారు. ప్రత్యేకమైన పరీక్ష కేంద్రాల్లో పూర్తి నియంత్రిత కంప్యూటర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. అయితే, షార్గిన్ తన హ్యాకింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, ఆ కంప్యూటర్లకు బయటి నుంచి సమాచారం చేరవేసే వెసులుబాటు కల్పించాడు. తద్వారా, పెద్ద సంఖ్యలో విద్యార్థులకు వారి సన్నిహితులు బయటి నుంచి సహాయం చేసేందుకు మార్గం సుగమం చేశాడు.
విద్యార్థులు పరీక్ష హాల్లో కంప్యూటర్ల ముందు ఉండగా, వారి లెక్చరర్లు, శిక్షకులు బయట కోచింగ్ సెంటర్లలో ఉండి ప్రశ్నలకు జవాబులు చేరవేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా 24 మందిని అరెస్ట్ చేశారు.
ఈ కేసు వెలుగులోకి రాగానే భారత్ విడిచి వెళ్లిన మిఖాయిల్ షార్గిన్... ఇటీవలే కజకిస్థాన్ నుంచి భారత్ చేరుకోగా, అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సీబీఐకి అప్పగించారు. 25 ఏళ్ల షార్గిన్ ను ఢిల్లీ కోర్టులో హాజరుపర్చగా, అతడిని రెండ్రోజుల కస్టడీకి అప్పగించినట్టు సీబీఐ వెల్లడించింది.
అతడొక ప్రొఫెషనల్ హ్యాకర్ అని, జేఈఈ మెయిన్ పరీక్ష కోసం ఉపయోగించిన ఐలియన్ సాఫ్ట్ వేర్ ను హ్యాక్ చేశాడని వివరించింది. అతడు విచారణలో సహకరించడంలేదని సీబీఐ నేడు కోర్టుకు తెలిపింది.
రష్యా జాతీయుడు షార్గిన్ స్పందిస్తూ, తన ఎలక్ట్రానిక్ పరికరాలను తెరిచేందుకు పాస్ వర్డ్ లు, ఇతర వివరాలను సీబీఐ కోరుతోందని, అయితే తన సమక్షంలోనే సీబీఐ తన ఎలక్ట్రానిక్ పరికరాలను తెరవాలని కోర్టుకు తెలిపాడు.