EC: ఉచితాలకయ్యే ఖర్చు, వాటికి నిధులు ఎక్కడ్నించి తెస్తారనే విషయాలు కూడా ప్రజలకు చెప్పండి: పార్టీలకు ఈసీ సూచన
- దేశంలో పెరిగిపోతున్న ఉచిత పథకాల సంస్కృతి
- ఇటీవలే ఎస్ బీఐ నివేదిక
- పరిమితి విధించాలని సూచన
- తాజాగా స్పందించిన ఎన్నికల సంఘం
దేశంలో ఎన్నికలు అనగానే, రాజకీయ పార్టీలు అడ్డుఅదుపులేని రీతిలో ఉచితాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ఉచితాలకు అడ్డుకట్ట వేయాలన్న చర్చ ఎప్పటినుంచో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ కూడా ఉచితాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటిపై పరిమితి విధించాలని ఓ నివేదిక వెలువరించింది.
కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అంశంపై స్పందించింది. ఉచితాలకు అయ్యే ఖర్చును, అందుకు అవసరమయ్యే నిధులు ఎక్కడ్నించి తెస్తారన్న విషయాలను కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు వివరించాలని ఈసీ స్పష్టం చేసింది. తద్వారా, ఉచితాలను ఆయా పార్టీలు నెరవేర్చగలవా, లేదా? అనే అంశంపై ఓటర్లకు ఓ అభిప్రాయం ఏర్పడుతుందని పేర్కొంది.
అయితే, ఈ ఉచితాలు, లేదా సంక్షేమ పథకాలకు చట్టబద్ధ నిర్వచనం అంటూ ఏదీ లేదన్నది వాస్తవం అని ఈసీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో ఈ ఉచితాలపై విచారణ జరుగుతున్నప్పటికీ తగిన స్పష్టత లేదని పేర్కొంది.
ఈ క్రమంలో, రాజకీయ పార్టీలే తాము ఫలానా పథకం ఏ కారణంతో ఇస్తున్నారో, వాటికి నిధులు ఎక్కడ్నించి తీసుకువస్తారో కూడా చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది. కాగా, ఇలాంటి హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేమని, అందుకే ఆయా ఉచితాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం తమ హక్కుగా ఓటర్లు భావించాలని సూచించింది.