YSRCP: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియామకం
- రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖలపై పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా సాయిరెడ్డి
- ఉత్తర్వులు జారీ చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్
- మోదీ, అమిత్ షా, సీఎం జగన్‌లకు ధన్యవాదాలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత (వైసీపీపీ నేత) విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ హోదాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయాన్ని సాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా వెల్లడించారు. ఈ కమిటీలో ఉపరితల రవాణా, పౌర విమానయానం, నౌకాయానం, పర్యాటకం, సాంస్కృతిక శాఖలకు చెందిన అంశాలు ఉంటాయి. ఈ కమిటీకి తనను చైర్మన్‌గా నియమించిన ధన్‌కడ్‌తో పాటు తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక పార్టీ నుంచి తనను ఈ పదవికి ఎంపిక చేసిన జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ పురోభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.